ఎల్కతుర్తి, ఏప్రిల్ 21: బీఆర్ఎస్ రజతోత్సవ సభపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అక్కసు వెళ్లగక్కారు. బీఆర్ఎస్ సభ కోసం వేస్తున్న రోడ్లు, కాలువల పూడ్చివేతను సోమవారం పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. సభ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా గేట్లను, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలను విచ్చలవిడిగా మట్టి తవ్వకాలతో పూడ్చుకుంటూ వస్తుండడంతో రైతులు భోరుమని విలపిస్తున్నారని తెలిపారు. అన్నసాగర్-ఎల్కతుర్తి మధ్యలో ఉన్న వాగును, హద్దులను చెరిపేసి వాగును పూర్తిగా ధ్వంసం చేశారని, దీనిపై ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేవలం రజతోత్సవ సభకు అనుమతులు మాత్రమే ఇచ్చామని, సభకు పొలాలు ఇచ్చిన వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
ఎస్సీల వర్గీకరణపై వివరణ ఇవ్వండి ; రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఎస్సీల వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ చట్టంపై 6 వారాల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు లాయర్ ఆకా శ్ బాగ్లేకర్ వాదిస్తూ.. దేవేందర్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను వర్తింపజేయాల్సి ఉన్నదని తెలిపారు. కానీ, దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇప్పటికే రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులే తిరిగి రిజర్వేషన్ల ఫలాలు పొందుతారని, దీంతో రిజర్వేషన్ల లక్ష్యం నీరుగారుతుందని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని కొట్టేయాలని కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. విచారణను 2 నెలలకు వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్ దా ఖలు చేశాక 2 వారాల్లోగా రిప్లయ్ కౌంటర్‌ను దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.