దుండిగల్, ఫిబ్రవరి 28: వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి యూఎస్‌లోని ఒక్ల హోమా విశ్వవిద్యాలయంతో దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఐఆర్టీ) ఒప్పందం చేసుకుంది. ఎంఎల్ఐఆర్టీ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం యూఎస్‌లోని ప్రతిష్టాత్మక ఒక్ల హోమా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఒక్ల హోమా విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ శివరామకృష్ణన్, లక్ష్మీవరహన్తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఎల్ఐఆర్టీ, ఓక్ల హోమా వర్సిటీ మధ్య పరస్పర సహకారం కోసం చర్చించారు. ప్రధానంగా అధ్యాపకుల నైపుణ్యాలను పెంపొందించడం, విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించుకోవడం, పరిశోధన తదితర భాగస్వామ్యాలను ఏర్పరచడంపై దృష్టి సారించారు. మార్గదర్శక విజ్ఞాన మార్పిడిని సులభతరం చేయడానికి, పరస్పర పురోగతిని పెంపొందించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వివిధ విభాగాలలో విప్లవాత్మక పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల డైరెక్టర్ అనుశ్రేయ రెడ్డి పాల్గొన్నారు.