హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హైడ్రా కూల్చివేతలపై అఖిలపక్షాన్ని ముందే పిలిచి సమావేశం పెట్టి ఉంటే బుచ్చ మ్మ బతికి ఉండేదని, మూడు నెలల నుంచి హైదరాబాద్ ప్రజలను హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ, హైడ్రాపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని చె ప్పారు. అఖిలపక్ష సమావేశం పెట్టాలని తా ము ముందునుంచే చెప్తున్నామని, 60-70 ఏండ్లుగా ఉంటున్న వారి నుంచి దశాబ్దాలుగా పన్నులు వసూలు చేస్తూ ఇప్పుడు వారిని కబ్జాదారులు అనడం సరికాదని హితవుపలికారు. చెరువులు ఎవరు కబ్జా చేశారో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు.
జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కలిసి తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువు లు ఉండేవి? ఇప్పుడెన్ని ఉన్నాయో ప్రభు త్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన పూర్తి అవగాహనతో మాట్లాడాలని చెప్పారు. ‘కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు చెరువులు ఆక్రమిస్తే.. అధికారం మీ చేతుల్లోనే ఉన్నది కాదా? విచారణ చేసుకోండి’ అని సూచించారు.
నియోజకవర్గంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లను బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించామని గుర్తుచేశారు. కాజాకుంటలో ఇద్దరు జడ్జిలకు ఏ పార్టీ నేతలు భూములు అమ్మారో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మూసీ తీర ప్రాంత ప్రజలను ఒప్పించి వారి ఇండ్ల్లను ఖాళీ చేయించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.