ED | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఫారెన్ ఎక్సేంజ్ మేనెజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలపైనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్టు తెలిసింది. విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో జరిగిన నగదు చెల్లింపులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులను తొలుత ప్రశ్నించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో ఐవోబీ అధికారులకు ఈడీ నుంచి నోటీసులు అందతాయని భావిస్తున్నారు.
విచారణలో వారు ఇచ్చే సమాచారంతో ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌కు నోటీసులు, ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్‌కు విచారణకు సంబంధించిన నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఈడీ వర్గాలు అంటున్నాయి. బ్రిటన్‌లోని ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు డబ్బు చెల్లించే క్రమంలో నాటి ప్రభుత్వం తరఫున అధికారులు ఎలాంటి నిబంధనలు పాటించారు? ముఖ్యంగా హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఆర్బీఐ నిబంధనలు పాటించిందా? ఉల్లంఘించిందా? ఒకవేళ ఉల్లంఘిస్తే అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? దాని వెనుక ఎవరిదైనా ప్రోద్బలం ఉన్నదా? అనే కోణంలోనే విచారిస్తారని సమాచారం.
ఎఫ్ఈవోకు నిధుల చెల్లింపు విషయంలో ఆర్బీఐ అనుమతి లేదని కొన్ని ప్రభుత్వ అనుకూల మీడియా చెబుతున్నా నేటికీ దానిపై స్పష్టమైన సమాచారం లేదు. సంబంధిత పత్రాలు బయటికి విడుదల చేయలేదు. అయితే, మంత్రి హోదాలో డబ్బులు చెల్లించాలని తానే అధికారులు చెప్పానని కేటీఆర్ వెల్లడించగా, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా, సంబంధిత ఫార్మాట్లో పంపాల్సిన బాధ్యత ముమ్మాటికీ నాటి ప్రభుత్వ అధికారులు, బ్యాంకు అధికారులదే.
ఈ నేపథ్యంలో నిబంధనలు తుంగలో తొక్కిన అధికారులను వదిలేసి కేటీఆర్‌ను ఏ1గా చేర్చడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందనేది అర్థమవుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు తొలుత తమకు ఫిర్యాదు చేసిన పురపాలకశాఖ కార్యదర్శి దానకిషోర్ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్టు సమాచారం. వారు సైతం అర్వింద్‌కుమార్ ఐఏఎస్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి నోటీసులిచ్చి వారిని విచారిస్తారని తెలిసింది.