Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. నా మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు? అంటూ ఆయన ప్రశ్నించారు. చాలామంది మంత్రులను తెలంగాణలో పార్లమెంట్‌కో ఇన్చార్జిని పెట్టారని.. కానీ, మంత్రి ఇన్చార్జిగా భువనగిరికి రాలేదని.. ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జిగా కాంగ్రెస్ పెట్టిందన్నారు. అన్ని పార్లమెంట్లకు మంత్రులు ఇన్చార్జిలుగా మంత్రులను పెడితే.. నాకు కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే.. నాకే గెలిపించకపోతే నన్ను ఎందుకు ఇన్చార్జిగా పెట్టారన్నారు.
తెలంగాణలో అంతా మంత్రులను ఇన్‌చార్జీలుగా పెట్టి.. భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేను అయిన నన్ను ఇన్‌చార్జీగా పెట్టారు ? గెలిపించే సత్తా ఉంది.. ప్రజల్లోకి వెళ్తాడనే కదా? అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? ఇన్చార్జ్గా పెడితే గెలిపించామా లేదా? అంటూ గుర్తు చేశారు. ఆదిలాబాద్, మహబూబాబ్‌నగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, కరీంనగర్లో కాంగ్రెస్ గెలిచిందా? మరి ఈ మంత్రులంతా ఎక్కడికి పోయారు అంటూ నిలదీశారు. దయా దాక్షిణ్యాలపై మీరు పదవి ఎప్పుడిస్తరని మేం ఎదురుచూస్తం లేమని.. నిజంగా పార్టీ బతకాలంటే.. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలంటే నిజాయితీగా, సమర్థవంతంగా, ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వానికి పేరు తీసుకువచ్చే వ్యక్తులకు మంత్రి పదవి ఇవ్వాలంటున్నామననారు. ఈ పైరవీ కారులను పక్కన పెట్టాలని అధిష్టానానికి సూచించారు.
కాంగ్రెస్ పార్టీ బలంగా కావాలని, యువకుడిని ప్రోత్సహించాలన్నారు. పార్టీ కోసం కష్టపడేవారిని, మానవత్వంతో పని చేసి, ప్రజలు, కార్యకర్తలతో మమేకమై.. అవసరమైతే ఢీ అంటే ఢీ అని కొట్లాడే శక్తి ఉన్న వారికి అధికారం ఇస్తే ప్రజలు సంతోషిస్తరని, పార్టీకి లాభం జరుగుతుందన్నారు. దారినపోయే దానయ్యకు పదవి ఇస్తే కొట్లాడుతడా? అంటూ ప్రశ్నించారు. పదవి అడుక్కునే పరిస్థితి లేనన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రంలోని పేదలకు కాంగ్రెస్ అండగా ఉండాలని నిజాయితీ ఉన్న వ్యక్తినన్నారు. నా విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని.. ధర్మరాజులా ఉండాల్సిన ఉండాల్సిన జానారెడ్డి కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ విషయంలో చాలా బాధగా అనిపించిందని.. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుందంటే.. పది మందికి పనికివచ్చే మనిషిని, వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని.. నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండంటే.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఎందుకంటే ఎక్కువగా చెప్పలేనని.. చెప్పాల్సిందంతా చెప్పానన్నారు. నన్ను చూస్తే అందరూ భయపడుతున్నారని.. నేను వస్తుంటే.. వామ్మో వస్తడంటే ఏం చేస్తడో.. మన మాట ఇంటడా లేదా అనుకుంటారేమోనని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించినా.. అది జరుగలేదు. మంత్రి పదవి రేసులో మొదటి నుంచి రాజగోపాల్‌రెడ్డి పేరు వినిపిస్తూ వస్తున్నది. ఇటీవల మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీలోని సీనియర్లకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజాగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.