నల్లగొండ ప్రతినిధి/నల్లగొండ, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ నిబంధనలు మునుగోడు నియోజకవర్గంలో చెల్లవు. ఇక్కడ నేను చెప్పిన సమయపాలన పాటిస్తూ, నేను రూపొందించిన రూల్స్ ఫాలో అవుతామంటేనే మద్యం దుకాణాలు తెరవాలి. లేదంటే దుకాణాలను అప్పగించి వెల్లిపోండి’ అంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హుకుం జారీ చేశారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణదారులు ఇతర ప్రాంతాల్లో మాదిరిగా తన నియోజకవర్గంలో విచ్చలవిడిగా వైన్స్, సిట్టింగ్స్ నడుపుకుంటామంటే కుదరదని, అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో కొత్త మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఆ నియోకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వ్యాపారులు ఈ భేటీకి హాజరైనప్పటికీ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 11 దుకాణదారులు హాజరుకాలేదని తెలిసింది. హాజరైన వారితో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలను నడుపుతామంటే కుదరదని తేల్చిచెప్పినట్టు వినికిడి. నియోజకవర్గంలోని మొత్తం 32 దుకాణాల ఏర్పాటుకు అనుమతులు లభించాయి.
వాటిని ఊరికి బయట దూరంగా ఏర్పాటు చేయాలని, అవి కూడా సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకే తెరవాలని, సిట్టింగ్‌లకు కూడా ఇదే సమయాన్ని పాటించాలని, బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేయకూడదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనిపై వ్యాపారులు స్పందిస్తూ.. కనీసం మధ్యాహ్నాం 1 గంట నుంచైనా దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని, లేకుంటే తీవ్రంగా నష్టపోతామని చెప్పినట్టు సమాచారం. అందుకు రాజగోపాల్‌రెడ్డి అంగీకరించకపోవడంతో ఏమి చేయాలో తేల్చుకోలేక వ్యాపారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
మునుగోడులో ఎమ్మెల్యేకు ఎదురుచెప్పలేక, ప్రభుత్వ పాలసీని అమలు చేయలేక ఎక్సైజ్ అధికారులు డైలామాలో పడ్డారు. ‘టెండర్ల సమయంలో ఎమ్మెల్యే చెప్పిన రూల్స్ ఏమీ ఉండవు. రాష్ట్రమంతటా అమలయ్యే పాలసీనే మునగోడులోనూ అమలు చేస్తాం’ అంటూ వ్యాపారులను బుజ్జగించారు. దీంతో టెండర్లు వేసిన వ్యాపారులు తీరా షాపులు వచ్చాక ఎమ్మెల్యే వార్నింగ్‌లతో బెంబేలెత్తిపోతున్నారు. సొంత నిబంధనలు అమలుచేయాలని వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హుకుం జారీచేసి ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారు. దీంతో వ్యాపారులకు ప్రభుత్వం తరఫున అధికారులు ఏమి భరోసా ఇస్తారు? మునుగోడులో ప్రభుత్వ మద్యం పాలసీని అమలు చేస్తారా? లేక ఎమ్మెల్యే నిబంధనలే అమలవుతాయా? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.