హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ బూడిద రాజకీయం చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఫ్లైయాష్ కుంభకోణం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. మంగళవారం ఆయన సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఎన్టీపీసీ పనులు ప్రారంభించినప్పటి నుంచి బూడిదను రైతులకు ఉచితంగా ఇచ్చామని, అయినా మంత్రిపై రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో టెండర్ ద్వారా ఎన్టీపీసీ బూడిదను అమ్ముతున్నారని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఎన్టీపీసీ లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. తన అవినీతి, అక్రమాలపై విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.