జగిత్యాల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జుమ్లా మాటలతో.. అబద్ధాలకు బాద్షాగా మారారని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకు మద్దతుగా శనివారం ఆమె కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం కోరుట్ల వచ్చిన అమిత్‌షా షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఝూట మాటలు చెప్పారని ఆరోపించారు. ఎయిర్ఇండియా వంటి భారీ ప్రభుత్వరంగ సంస్థలను మూసేసిన బీజేపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తుందంటే నమ్మొచ్చా? అని ప్రశ్నించారు. బోధన్ షుగర్ ఫ్యాకర్టీని ముంచిందే బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అని, కోర్టుల్లో కేసులు వేసి అనేక ఇబ్బందులు పెట్టారని తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటివారు ఇక్కడికి వచ్చి కుటుంబపాలన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘వారందరికీ ఒక్కటే సమాధా నం మాది నలుగురితో కూడిన కుటుంబం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో కూడిన కుటుంబం’ అని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ వచ్చిన బహుళజాతి సంస్థలల్లో 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తున్నదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కౌన్సిలర్లు
కోరుట్ల బీజేపీ అభ్యర్థి అర్వింద్ వైఖరి నచ్చక ఆ పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్, మున్సిపల్ కౌన్సిలర్ సునీత, పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి మురళి, ఆయన భార్య కౌన్సిలర్ అలేఖ్య, పెద్ద సంఖ్యలో కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.