హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని గొప్పలు చెప్పుకొంటున్న శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు పది సార్లు అవకాశమిచ్చినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టగలరా? అని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సవాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోనే కాదు 18 బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా తెలంగాణ అమలు చేసినన్ని పథకాలు దశాబ్దాలైనా అమలు చేయలేరని పేర్కొన్నారు. శనివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కాదని, శివరాజ్ చోర్ అని ఎద్దేవా చేశారు. దేశంలోనే అతిపెద్ద వ్యాపమ్ కుంభకోణం శివరాజ్‌సింగ్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. దీనిని మరచిపోయి నీతులు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయిన చౌహాన్ నీతులు చెప్పడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఎవరో ఒకరు రాసిచ్చిన స్రిప్ట్ పట్టుకొని రోజుకో డబ్బింగ్ ఆర్టిస్ట్ వస్తున్నాడని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల బీజేపీ నేతలు వచ్చి, అసత్యాలు ప్రచారం చేస్తే నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని, దేశానికే స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్, ఆర్బీఐ వంటి సంస్థలే కాకుండా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలు ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా తెలంగాణ పథకాలను ప్రశంసించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రగతి చూస్తుంటే బీజేపీ నేతలకు కండ్లమంటగా ఉన్నదని, ఇప్పుడు చౌహాన్ నాలిక మడతేశారని పేర్కొన్నారు. రైతుల ఆగ్రహానికి గురై, వెన్నుచూపిన మోదీ లాంటి ప్రధాని దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ అంటే బేరగాళ్లు, జూటగాళ్ల పార్టీలా తయారైందని మండిపడ్డారు. దేశంలో బీజేపీది అవినీతి, ద్వంద్వనీతి, దమననీతి అయితే, టీఆర్ఎస్ది రాజనీతి అని పేర్కొన్నారు.