మహబూబాబాద్,ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/పెద్దవంగర: కాంగ్రెస్ ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రూనాయక్ సొంత తండాలో కేవలం 28 మంది రైతులు వ్యవసాయ రుణాలు తీసుకుంటే.. మాఫీ అయ్యింది మాత్రం ఏడుగురికే. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డి కుంట తండా జీపీ పరిధిలోని సర్పంచ్ తండాలో 30 మంది రైతులు ఉన్నారు. ఇందులో 28 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. కొంత మంది రూ.లక్ష, మరికొందరు రూ.రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్నారు. వీరిలో ఏడుగురికే రుణమాఫీ జరిగింది. మిగిలిన 21 మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తండాలో చాలా ఇండ్లలో భార్యాభర్తలకు ఇద్దరి పేరు మీద పాస్ పుస్తకాలు ఉన్నాయి. రుణమాఫీ నిబంధనల ప్రకారం ఇద్దరిలో ఒకరికి రుణమాఫీ కావాలి. అలా కూడా రుణమాఫీ కాలేదు. మాకు ఎప్పుడు రుణమాఫీ అయితదని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఇదే తండాకు చెందిన జాటోత్ మంగమ్మ అనే మహిళ పాస్ పుస్తకంలో, బ్యాంకు ఖాతాలో, ఆధార్కార్డులోనూ పేర్లు సరిగానే ఉన్నాయి. ఈ లెక్కన ఈమెకు రుణమాఫీ కావాలి.. కానీ కాలేదు. బ్యాంక్, వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి అడిగితే ఈమె ఆధార్ కార్డు నంబర్‌ను ఆన్లైన్లో ఎంటర్ చేసి చూస్తే జాటోత్ మంగమ్మకు బదులుగా బానోత్ మంగమ్మ అని పేరు చూపిస్తున్నదని చెప్తున్నారు. దీంతో రుణమాఫీ ఆగిపోయింది.
నాతో పాటు నా భార్య పేరు మీదు మొత్తం 12ఎకరాల భూమి ఉంది. తొర్రూరు ఏపీజీవీబీలో ఒకరిపై రూ.1.65లక్షలు, మరొకరిపై రూ.1.70లక్షల రుణం ఉంది..ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూనే ఉన్నం. కేసీఆర్ ప్రభుత్వంలో ఇద్దరికి కలిపి రూ.లక్ష రుణమాఫీ అయ్యింది. మళ్లీ పైసలు తీసుకున్నం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెయ్యలే. మా కుటుంబంలో ఒక్కరికైనా మాఫీ చేయలేదు.
-జాటోతు దేవా, దుబ్లీ దంపతులు, సర్పంచ్ తండా