Jagadish Reddy | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తమ వాదన వినకుండా, పూర్తిస్థాయిలో విచారించకుండానే ఓ నిర్ణయానికి ఎలా వచ్చేస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్తుశాఖలో అక్రమాలు జరిగాయంటూ విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై జగదీశ్‌రెడ్డి ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. నాడు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్లంతా నేడు ప్రభుత్వంలో ఉండి కమిషన్ల పేరుతో కేసీఆర్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చీకట్లలో ఉన్న తెలంగాణను అభివృద్ధిపథంలోకి నడిపించిన కేసీఆర్ కృషిని కనీసం కమిషన్ అయినా బయటపెడుతుందని ఆశపడినట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విచారణ పూర్తికాకుండా, మరోపక్షం వాదనలు వినకుండా తమ విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పించకుండానే పక్షపాత వైఖరితో కమిషన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఆక్షేపిస్తున్నట్టు పేర్కొన్నారు. కమిషన్ చైర్మన్ రాజీనామా చేయాలని కేసీఆర్ కోరడాన్ని తామంతా సమర్థిస్తున్నట్టు తెలిపారు.
విచారణ అర్హత కోల్పోయారు
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన విద్యుత్తు ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్‌తో కరెంటు కొనుగోలు ఒప్పందం తదితర అంశాలపై తమ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్, బీజేపీ పెద్దలు సందేహాలు లేవనెత్తితే అప్పుడే అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పినట్టు జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. విద్యుత్తుశాఖపై మళ్లీ శ్వేతపత్రం విడుదల చేస్తూ చర్చపెడితే అప్పుడు కూడా వాస్తవాలు వివరించామని పేర్కొన్నారు. ఎటువంటి విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెబితే జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేశారని గుర్తుచేశారు. విచారణకు ముందే కమిషన్‌కు ఏవో ఉద్దేశాలు ఉన్నాయని, వాదనలు వినకుండా తీర్పులు ఇచ్చే పద్ధతుల్లో చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధ కలిగించాయని, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయని, కాబట్టి ఈ విచారణ చేయడానికి వారు అర్హత కోల్పోయారని పేర్కొన్నారు.
తెలంగాణ బిడ్డగా ఆయనపై గౌరవం ఉంది
చీకట్లలో ఉన్న తెలంగాణను ఏడాదిలోపే అద్భుతమైన వెలుగులతో నింపిన పరిపాలకుడిగా, విజనరీ లీడర్‌గా కేసీఆర్ పట్ల కమిషన్ చైర్మన్‌కు మంచి అభిప్రాయం ఉంటుందని అంతా అనుకున్నట్టు జగదీశ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ బిడ్డగా ఎల్ నర్సింహారెడ్డి అంటే కేసీఆర్‌కు చాలా గౌరవం ఉందని తెలిపారు. జడ్జికాక ముందు తెలంగాణవాదిగా ఉన్నారని, ఆ తర్వాత వారి అభిప్రాయాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. హైకోర్టు సీజేగా చేసిన వారి ఆలోచనలు కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మారాయనే విషయాన్ని 11వ తేదీన నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారే బయటపెట్టుకున్నారని విమర్శించారు. తామెప్పుడూ కమిషన్‌ను వ్యతిరేకించలేదని, గతంలో ఇలాంటి కమిషన్లపై చాలామంది కోర్టులకు వెళ్లి ఆపిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. చట్టబద్ధమైన ఈఆర్సీలు ఇచ్చిన తీర్పులపై ప్రభుత్వాలకు విచారణ జరిపే హక్కు ఉండదని, ఆ విషయం సీజేగా పనిచేసిన వ్యక్తికైనా తెలిసి ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయం తమకు తెలిసినప్పటికీ కమిషన్‌పై నమ్మకంతో ఆ విషయం మాట్లాడలేదని చెప్పారు.
పీజీసీఐఎల్ లైన్బుకింగ్ వల్లే ఒప్పందం
పీజీసీఐఎల్ లైన్బుకింగ్ వల్లే ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందం చేసుకున్నామని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నాడు దక్షిణాది నుంచి ఉత్తరాదికి విద్యుత్తు సరఫరాలకు లైన్లు లేవని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మొదటిసారిగా ఉత్తర భారతం నుంచి దక్షిణానికి విద్యుత్తు లైన్ వస్తున్న క్రమంలో దానిని ముందుగానే బుక్ చేసుకోవాలంటే ఉత్తరాదిలో ఉన్న ఏదైనా పవర్ ప్లాంట్ నుంచి ఒప్పందం ఉండాలనే నిబంధన ఉన్నట్టు జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అలా ఉంటేనే లైన్లో వచ్చే కరెంటును కొనుగోలు చేసుకోవాడనికి అనుమతులు ఇస్తారని వివరించారు. పీజీసీఐఎల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అని, విద్యుత్తు కొనుగోలు ధర నిర్ణయించేది ఈఆర్సీలు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం చెప్పామని పేర్కొన్నారు. కేసీఆర్ చొరవతో తెలంగాణకు 1000 మెగావాట్ల విద్యుత్తును ఇచ్చేందుకు అప్పటి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణసింగ్ అంగీకరించారని తెలిపారు. ‘ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అవినీతికి ఆస్కారం ఉంటుందా?’ అని ప్రశ్నించారు.
యూనిట్‌కు రూ.3.94 చొప్పున కొనుగోలు
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీలు కలిసి లెక్కలు వేసి మిగులు విద్యుత్తు ఒక్కో యూనిట్‌కు రూ. 3.94 చొప్పున ధర నిర్ణయించినట్టు జగదీశ్‌రెడ్డి వివరించారు. తమిళనాడు రూ.4.94, కర్ణాటక రూ.4.33 చొప్పున అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలిపారు. మరి ఇందులో లోపం ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీలు చేసిన ఆరోపణలే జడ్జి మనసులోనూ ఉన్నాయని ఇప్పుడు తమకు తెలిసిందని, ఆయన ఏయే పార్టీలతో సంబంధం ఉన్నదనేది తమకు తెలియదని పేర్కొన్నారు. కేసీఆర్ వివరణ, అవసరమైతే ఛత్తీస్‌గఢ్, కేంద్ర సంస్థల నుంచి వివరణ తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని, కానీ మధ్యలోనే మీడియాకు వివరాలు ఎలా వెల్లడిస్తారని నిలదీశారు. దేశంలో వేసిన వందలాది కమిషన్లు ఎప్పుడైనా ఇలా మధ్యలోనే ప్రెస్మీట్లు పెట్టాయా? అని ప్రశ్నించారు. దీనిని బట్టే వారి దురుద్దేశం ఏమిటో అర్థమైందని పేర్కొన్నారు.
ప్రైవేట్ కంపెనీల తరఫున కాంగ్రెస్ వత్తాసు
భద్రాద్రి పవర్‌ప్లాంట్ విషయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలకు జగదీశ్‌రెడ్డి బదులిస్తూ దేశంలో 90శాతం విద్యుదుత్పత్తి సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే జరుగుతున్నదని, తెలంగాణ విద్యుత్తు ప్రయోజనాలను కేసీఆర్ దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వకుండా పారదర్శకంగా ఉండే ప్రభుత్వ రంగసంస్థ బీహెచ్ఈఎల్కు భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణ బాధ్యతలు ఇచ్చారని చెప్పారు.
సూపర్ క్రిటికల్‌కు కనీసం 8 ఏండ్ల వ్యవధి
సూపర్ క్రిటికల్ ప్లాంట్‌ను తీసుకురావడానికి కనీసం కనీసం 8 నుంచి 10 ఏండ్లు పడుతుందని స్వయంగా బీహెచ్ఈఎల్ ప్రతినిధులు చెప్పారని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఎంతత్వరగా పూర్తి చేయాలనుకున్నా కనీసం 5 ఏండ్లు పడుతుందని చెప్పినట్లు తెలిపారు. ‘ప్రస్తుతం 270 మెగావాట్ల ఉత్పత్తికి ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంది. వాటితో నాలుగు ప్లాంట్లు పెట్టుకుంటే 1080 మెగావాట్లు పెట్టుకోవచ్చు. అలాగైతే రెండేండ్లలో పూర్తిచేసి ఇస్తాం’ అని వారు హామీ ఇవ్వడంతో అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. దురదృష్టవశాత్తూ తెలంగాణ వ్యతిరేకి ఒకరు ఎన్జీటీలో కేసు వేస్తే దానికి స్టే ఇవ్వడం వల్ల ఆలస్యమైందని తెలిపారు. ప్లాంట్ల నిర్మాణంలో నాటి సీఎండీ ప్రభాకర్‌రావు వంటివారు నిర్మాణదారులతో మాట్లాడి రూ.400 కోట్లు ప్రభుత్వ సొమ్మును మిగిల్చారని గుర్తుచేశారు.
నాడు బొగ్గు తరలిస్తే నోరు మెదపలె?
అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా సమానంగా జరగాలనేది కేసీఆర్ తపన అని, అందుకే యాదాద్రి పవర్ ప్లాంట్‌ను తీసుకొచ్చారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూమి, నీళ్లు, రోడ్డు, రైలు మార్గం వంటివి అందుబాటులో ఉన్న నల్లగొండలో యాదాద్రి పవర్ ప్లాంట్‌ను తీసుకొచ్చారని తెలిపారు. యాదాద్రికి బొగ్గు తీసుకురావడానికి డబ్బులు ఖర్చు అవుతాయని వితండవాదం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, సమైక్యాంధ్రలో వీటీపీఎస్‌కు, రాయలసీమ ఆర్టీపీపీకి బొగ్గు ఎక్కడి నుంచి తీసుకెళ్లారని ప్రశ్నించారు. 900 కిలోమీటర్లు ఎలా తరలించారని నిలదీశారు. కేసీఆర్ మీద బురదజల్లాలనే దురుద్దేశంతోనే ఇదంతా జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ రవీందర్రావు, నాయకులు గెల్లు శ్రీనివాస్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు.
సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంటే?
దేశంలో 90 శాతం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కలిగినవే. వీటిలో ఒక్కప్లాంట్లో 30 మెగావాట్ల నుంచి 60, 100, 200, 500 మెగావాట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. వీటివల్ల పర్యావరణానికి కొంత ముప్పు వాటిల్లుతుందని కేంద్రం చెప్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఒక ప్లాంట్‌లో 800 మెగావాట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేసే టెక్నాలజీ వచ్చింది. దీనికి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టారు. 800 మెగావాట్లలోపు ఉత్పత్తి చేసే విద్యుత్తు వ్యవస్థలను సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని, 800 మెగావాట్లకు పైగా ఉత్పత్తి చేసే ప్లాంట్ టెక్నాలజీని సూపర్ క్రిటికల్ వ్యవస్థలని అంటారు. తక్కువ సామర్థ్యంతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు ప్లాంట్ల ద్వారా పొగ ఎక్కువగా వస్తుందని, దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్న చర్చ మొదలైంది. ఫలితంగా సూపర్ క్రిటికల్ వ్యవస్థ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం జరిగింది. దాని ప్రకారం 2017 మార్చిలోపు నిర్మితమయ్యే అన్ని విద్యుత్తు ప్లాంట్లకు ఏ టెక్నాలజీ అయినా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం తప్పనిసరిగా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వ్యవస్థ ఉండాలి.