Harish Rao | సిద్దిపేట, ఆగస్టు 25 : విద్యుత్తు తీగలకు అడ్డు వస్తున్నాయని కొమ్మలను గాకుండా చెట్లనే నరికి వేస్తారా? అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యుత్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో చెట్లను నరకడాన్ని గమనించిన ఆయన ఈ విషయమై విద్యుత్ అధికారులను ప్రశ్నించారు.
‘పసిపిల్లల్లా ఇరవై ఏండ్లుగా చెట్లను పెంచాం.. కరెంట్ తీగలకు అడ్డం వస్తే చెట్లను కాదు.. కొమ్మలను నరకండి.. పూర్తిగా చెట్లను నరికివేయడం ఏమిటి? అని నిలదీశారు. ముందుచూపు లేకుండా, పర్యవేక్షణ లేకుండా గుడ్డిగా కార్మికులను పెట్టి చెట్లను తొలగించడంపై మండిపడ్డారు. పర్యావరణానికి ఎంతో ఉపయోగపడే చెట్లను విచక్షణారహితంగా తొలగించడం దుర్మార్గమని, తొలగించాలని ఆదేశించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.