Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగా ణ): పోలీసులను అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడి చేసినపుడు లాఅండ్ఆర్డర్ గుర్తురాలేదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గుర్తుకు రాలేదా? అని సీఎం రేవంత్‌ను మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి కారణమే రేవంత్ అని దుయ్యబట్టారు. కౌశిక్‌రెడ్డిపై దాడులను రేవంత్, డీజీపీ ఎం దుకు ఆపలేదని నిలదీశారు. శుక్రవారం కోకాపేటలోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేపై దాడి జరుగుతుంటే సీఎం, డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అది గాంధీ చేసిన దాడి కాదని, రేవంత్‌రెడ్డి చేసిన దాడి అని విమర్శించారు. కూకట్పల్లి నుంచి 8 పోలీస్స్టేషన్లు దాటించి పోలీస్ బందోబస్తు ఇచ్చి మరీ కౌశిక్‌రెడ్డి ఇంటికి వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు.
ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారని తెలిపారు. తనతో సహా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులందరని హౌజ్ అరెస్ట్ చేశారని, మరి గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదని నిలదీశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్టులు చేస్తరా? తమను అరెస్టుచేసి, హత్యాయత్నం చేసిన అరికపూడి గాంధీ, ఆయన అనుచరులను ఎస్కార్ట్ బందోబస్తు మధ్య ఇంటికి పంపుతారా? అని ప్రశ్నించారు. వారికి బిర్యానీలు, సమోసాలు, చాయ్‌లతో రాచమర్యాదలు చేశారని, తమకు నీళ్లు కూడా ఇవ్వకుండా గంటల పాటు తిప్పారని ఫైర్ అయ్యారు. కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ అంతా రేవంత్‌రెడ్డేనని, ఆయన డైరెక్షన్లోనే దాడి జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర ఖ్యాతిని పాడుచేయొద్దని, పోలీసుల గౌరవాన్ని తగ్గించొద్దనే సంయమనం పాటించామన్నారు. దానం, గాంధీ.. కేసీఆర్ నాయకత్వంలో ఎలా ఉన్నారు? రేవంత్ నాయకత్వంలో ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటూ ఎద్దేవా చేశారు.
యధా రాజా తథా ప్రజా
రాష్ట్రంలో యధా రాజా తథా ప్రజా అన్న పరిస్థితి ఉన్నదని హరీశ్‌రావు అన్నారు. రాజ్యాంగంపై ప్రమా ణం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. బీఆర్ఎస్ నాయకులను కొట్టాలని మాట్లాడుతున్నారని తెలిపారు. సీఎం తనను తాను రివ్యూ చేసుకోవాలని, మంత్రులను రివ్యూ చేసుకోవాలని చురక అంటించారు. రేవంత్‌రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ‘విత్తొకటి నాటితే మొకొకటి మొలుస్తుందా? పైన సకగ ఉండాల్సిన నీకే వక్రబుద్ధి ఉంటే కిందిస్థాయిలో సకగా ఉంటారా? నీ అసభ్య, సంసారహీనమైన భాష మార్చుకోకుండా యూట్యూబ్ చానళ్లకు నీతులు చెప్తున్నవా?’ అని సీఎంపై మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌ది యూటర్న్ రాజకీయం
ఎన్నికే లేకున్నా పీఎస్సీ చైర్మన్‌ను నియమించి.. ఎన్నిక జరిగిందని రేవంత్ చెప్పటం దుర్మార్గమని హ రీశ్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా నియామకం జరిగిందని, రాజ్యాంగం ప్రకారం ఎన్నిక పెట్టాలి కానీ, జరగలేదని వెల్లడించారు. అన్నింటిపైనా రేవంత్‌ది యూటర్న్ రాజకీయమేనని, చెప్పేదొకటి చేసేదొకటి, సీఎం డ్రామాలతోనే రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ధ్వజమెత్తారు. రేవంత్ ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి మరో సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆదర్శంగా ఉండాల్సిన డీజీపీ.. రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొకాలని చూడటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. గుడ్డిగా రేవంత్‌రెడ్డిని ఫాలో కావొద్దని, విచక్షణతో పని చేయాలని డీజీపీని, పోలీసులను కోరుతున్నానని అన్నారు.
రాజకీయం కాదు.. రాష్ట్రమే ముఖ్యం
తమకు పోరాటాలు, ఉద్యమాలు, కొట్లాటలు, అరెస్టులు కొత్త కాదని, జైలుకు పోయినవాళ్లం, లాఠీ దెబ్బతిన్నవాళ్లం, పదవులు త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్లమని, రాష్ట్రం గురించి బాధ్యతగా ఆలోచిస్తున్నామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘దాడికి ప్రతిదాడి చేయలేక కాదు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టే ప్రతిదాడుల గురించి ఆలోచించటం లేదు. ఖమ్మం, హైదరాబాద్‌లో మీ రు మమ్మల్ని రాళ్లతో కొట్టవచ్చు, ఎన్ని రాళ్లు విసురుతావో విసురు, మీరు విసిరే రాళ్లే బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి పునాది రాళ్లు అవుతాయి’ అని అన్నారు. ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా తమ సంకల్పాన్ని నీరుగార్చలేరని తేల్చిచెప్పారు. చినజీయర్‌స్వామిని, ఆనంద్‌సాయి ఆంధ్రోళ్లు అన్నవ్. కానీ, కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకున్నారు’ అని హరీశ్ వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్ పాల్గొన్నారు.
హౌస్ అరెస్టులే ప్రజాపాలనా?
ప్రధాన ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేయడమే ప్రజాపాలనా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అని శుక్రవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘హైదరాబాద్‌లో నన్ను హౌస్ అరెస్టు చేశారు. నా ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎకడికకడ మా పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ఇందిరమ్మ రా జ్యం. సిగ్గు సిగ్గు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నావు రేవంత్‌రెడ్డి.. దాడులు చేసిన వారిని వదిలి, బాధిత పక్ష నేతలను అరెస్టులు చేయ డం, భయభ్రాంతులకు గురిచేయడం దుర్మా ర్గం’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్యారెంటీల గురించి అడిగితే డ్రామా..రుణమాఫీ, ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే డ్రామా..వరద బాధితులకు సాయంపై అడిగితే డ్రామా..రైతుబంధు అడిగితే కాళేశ్వరం లీక్ అంటూ డ్రామా..సీఎం రేవంత్‌రెడ్డివి అన్నీ డైవర్షన్ పాలిటిక్సే!
– హరీశ్‌రావు