కాంగ్రెస్ అంటేనే ధోకా పార్టీ అని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ బడ్జెట్ ప్రసంగమంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసమే తయారు చేసినట్టున్నది. బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత, దార్శనికత ఏమాత్రం లేదు. ధోకా చేసినందుకు రాష్ట్ర ప్రజానీకానికి సభ సాక్షిగా క్షమాపణలు చెప్పాలి.
-హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా దాదాపు మంత్రులందరు, కాంగ్రెస్ సభ్యులు తన వాదనకు అడ్డుతగులుతున్నా.. మైక్ కట్‌చేసినా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రసంగంలో పదును ఏమాత్రం తగ్గలేదు. ‘హరీశ్‌రావు వీరవిహారం చేశారు’ అంటూ.. శనివారం బడ్జెట్‌పై ఆయన చేసిన ప్రసంగానికి శాసనసభ ప్రాంగణమంతా ఆసక్తికరమైన చర్చ జరిగింది. తన ప్రాసలు.. పంచ్‌లతో అధికార పక్షాన్ని ఆయన ఇరుకునపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక, ప్రభుత్వ విప్ సహా ఇతర సభ్యులు ఆయన ప్రసంగాన్ని పలుమార్లు అడ్డుకోవాలని చూశారు. వారికి కౌంటర్లు ఇస్తూనే తాను చెప్పదలచుకున్న అంశం నుంచి సభ్యులు అటెన్షన్‌ను మరల్చకుండా ఏకధాటిగా 80 నిమిషాలు (ఇందులో 40 నిమిషాలపాటు.. 18 సార్లు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. లెక్కలేనన్నిసార్లు మైక్‌కట్ చేశారు) ప్రసంగించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనే మాట్లాడ్తాను. దయచేసి మధ్యలో ఎవరూ కల్పించుకొని స్వీపింగ్ కామెంట్స్ చేయద్దు’ అని స్పీకర్‌ను కోరుతూ హరీశ్‌రావు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
సీఎంకు మంత్రులకు కౌంటర్
సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సభసాక్షిగా కౌంటర్ ఇచ్చారు. ‘మేము పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పం’ అని సీఎం అనగానే ‘మహేశ్వరం’ను న్యూయార్ చేస్తమని చెప్పింది మీరే కదా’ అంటూ సమాధానం ఇచ్చారు. గొర్రెల పంపిణీ, కేసీఆర్‌కిట్, బతుకమ్మ చీరలపై విచారణకు ఆదేశిస్తామని సీఎం అన్నారు. పాలమూరుకు బీఆర్ఎస్ ఏమీ చేయలేదని, వలసలు ఆగలేదని చెప్పారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ.. పాలమూరు గతిని మార్చిం దే కేసీఆర్ అన్నారు. పాలమూరుకు ఆ స్థితి రావటానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని చెప్పారు. పాలమూరులో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై అవసరమైతే ఓ రోజు చర్చకు అవకాశం ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అక్కడ ప్రాజెక్టులు కట్టామని, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ సహా అనేక పనులు చేశామని హరీశ్స్పష్టం చేశారు.
అడుగడుగునా అడ్డగింత
హరీశ్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ఉపముఖ్యమంత్రి, మంత్రులు, విప్ సహా కాంగ్రెస్ సభ్యులు పోటీ పడ్డట్టే వ్యవహరించారు. ఆయా సందర్భాల్లో ‘నేను ఒక్కోశాఖకు సంబంధించి బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలు మాట్లాడుతున్నాను. ఒక్కోశాఖకు ఒక్కో మంత్రి స్పందిస్తే నాకు సమయం ఎక్కడుంటది? అట్లంటే 32 శాఖల గురించి మాట్లాడితే.. సంబంధిత మంత్రులంతా కలుగజేసుకుంటారా? సభను ఆర్డర్లో పెట్టండి’ అని స్పీకర్‌ను కోరి తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నదని అంటూ హరీశ్‌రావు ఆయా రంగాలపై బడ్జెట్ అంశాలను వివరిస్తున్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘ధోకా… ధోకా’ అంటూ నినాదాలు చేశారు.
ఒక మినిస్టర్..ఐస్‌క్రీం..
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దుస్థితిని, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును సభలో వివరిస్తూ హరీశ్‌రావు తన దృష్టికి వచ్చిన ఒక అంశాన్ని వివరించారు. ఇటీవల రాత్రి 10 గంటలకు ఒక మంత్రి తన కుమార్తెతో కలిసి ఐస్‌క్రీం తినేందుకు బయటకు వెళ్లారని, అయితే, ఎక్కడా ఒక్క ఐస్‌క్రీం బండి కనిపించలేదని వివరించారు. ఎట్టకేలకు కనిపించిన బండి వద్దకు వెళ్లి మంత్రి స్వయంగా ఆరా తీయగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాత్రి 10 దాటితే పోలీసులు వచ్చి బండ్లు, దుకాణాలను మూయించివేస్తున్నారని, లేదంటే లాఠీలతో వీపులు పగలగొడుతున్నారని యూపీకి చెందిన సదరు ఐస్‌క్రీమ్ బండి నిర్వాహకుడు గోడు వెల్లబోసుకున్నారని వివరించారు. ఇదే విషయాన్ని సదరు మంత్రి ఇటీవల జరిగిన క్యాబినెట్లో సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారని, పోలీసుల జులుంను వివరించారని, అయినా పరిస్థితేం మారలేదని చెప్పారు. హరీశ్‌రావు చెప్పిన ఈ ఐస్‌క్రీం ఉదహరణతో సభలో, మీడియా గ్యాలరీలోనూ ఎవరా మంత్రా అని చర్చ కొనసాగడం విశేషం.
ఢంకాలు కొట్టారు.. వంకలు వెతుకుతున్నరు
బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క చెప్పినట్టు ‘చేతగానమ్మకు మాటలెకువ’ అనే మాట కాంగ్రెస్‌కే అచ్చుగుద్దినట్టు సరిపోతుందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికలప్పుడు హామీల ఢంకా బజాయించారని, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా వంకలు వెతుకుతున్నారని విమర్శించారు. ఎనిమిది నెలల పాలనలో రాజకీయ గారడీ, ఇప్పుడు అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనే అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకాన్ని సత్వరమే అమలుచేయాలని, లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు ప్రభుత్వం పాలిట మహాంకాళులు అవుతారని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు అందరికీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, షరతులు విధిస్తున్నారని, ప్రభుత్వ వైఖరి వ్యాపారవర్గాల వ్యవహారంలానే ఉన్నదని విమర్శించారు. ఇకనైనా రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం మంచిదేనని స్వాగతించారు. బస్సులు సరిపోక ప్రజలు నానా యాతనలు పడుతున్నారని, వెంటనే బస్సుల సంఖ్య పెంచాలని కోరారు.
పోస్టులు పెంచండి..సమస్యలేవీ రావు
రెండు లక్షల ఉద్యోగాల హామీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేకుండాపోయిందని, ఒక రూపాయి కూడా కేటాయించలేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నిరుద్యోగుల్లో ఆశలు రేపి, బస్సుయాత్రలు చేయించి, గడప గడప తిప్పి ఓట్లు దండుకుని ఇప్పుడేమో మొండిచేయి చూపారని నిప్పులు చెరిగారు. తాము నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియ పూర్తీ చేసిన 31,761 ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి అవి కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం ప్రభుత్వ దివాలాకోరుతనానికి ప్రబల నిదర్శనమని నిప్పులుచెరిగారు. మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-2 నోటిఫికేషన్లో అదనంగా రెండు వేల పోస్టులు, గ్రూప్ 3లో మూడు వేల పోస్టులు పెంచుతామన్న మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని గతంలో డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు అదే విషయం అడిగితే అణచివేస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ యువత ఆశలతో రాజకీయ చెలగాటమాడుతారా? అని నిలదీశారు. హామీలను అమలుచేయాలని, పోస్టులను పెంచాలని, ఎలాంటి న్యాయసమస్యలు రాబోవని, గత ప్రభుత్వాలు కూడా పెంచాయని ఉదహరించారు.