భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి (Moranchapalli) ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో మోరంచ వాగు (Morancha vaagu) ఉప్పొంగింది. దానికి గణప సముద్రం (Ganapa Samudram) వరద తోడటంతో మోరంచ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఊరిని మొత్తం వరద చుట్టుముట్టింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఇండ్లు మొత్తం నీటమునిగాయి. ఇండ్లపైకి చేరుకున్న గ్రామప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తెల్లవార్లు గడిపారు. ప్రభుత్వం రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు, బోట్లతో వాగులో చిక్కుకుపోయినవారిని రక్షించారు.

రోజు గడిచింది. మోరంచ వాగు శాంతించింది. జలదిగ్భందంలో చిక్కుకుని మునిగిపోయిన ఇండ్లు తేలాయి. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారి కొట్టుకుపోయింది. అయితే శుక్రవారం ఉదయానే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి (MLA Gandra Venkata Ramana reddy), జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి (Gandra Jyothi) మోరంచపల్లికి చేరుకున్నారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. బాధితుల క్షేమసమాచారాలు అడిగితెలుసుకున్నారు. పలువురు వరద ఉధృతిని గురించి గండ్ర దంపతులకు వివరించారు. కాగా, బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.




