జనగామ, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : దేవాదుల పంపులు సకాలంలో ఆన్‌చేసి నీళ్లివ్వలేని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల మధ్య కొట్లాటలతోపాటు రైతుల మధ్య చిచ్చుపెట్టిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. లెఫ్ట్ కెనాల్ విప్పితే.. రైట్ కెనాల్ వాళ్లు కొట్లాట.. రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తే ఆయకట్టు రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జనగామ నియోజకవర్గంలోని 91 మంది లబ్ధిదారులకు రూ.26.48 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, చీటకోడూరు రిజర్వాయర్ల ద్వారా గతంలో వాటి పరిధిలోని చెరువులు, కుంటలన్నీ నిండాయని గుర్తుచేశారు. కేసీఆర్ కట్టిన సమ్మక్క బ్యారేజ్‌లో ఎండాకాలంలోనూ నీళ్లు ఉన్నా.. వాటిని తీసుకొచ్చే తెలివి కాంగ్రెస్ పాలకులకు లేదన్నారు. గోదావరిలో నీళ్లుండి..ఎత్తడానికి మోటర్లుండి.. ఆన్ చేయడానికి కరెంటు, పని చేయడానికి వ్యవస్థ ఉన్నా నేరపూరిత నిర్లక్ష్యంతో ప్రభుత్వం 34 రోజులు మెయింటెనెన్స్ రూ.6 కోట్లు విడుదల చేయకపోవడంతో రూ.600 కోట్ల పంట నష్టం జరిగిందని ధ్వజమెత్తారు.