యాదాద్రి భువనగిరి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంతూరు సైదాపురంలో రుణమాఫీ అందని ద్రాక్షగానే మిగిలింది. మొత్తం 1,008 మంది రైతుల్లో దాదాపు 600 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. సర్కారు పెట్టిన అనేక కొర్రీలతోనే రుణమాఫీ జరుగడం లేదు. జాబితాలో ఉన్న వారిలో కొందరికి మాఫీ అవలేదు. దాంతో రైతులు బ్యాంకులు, రైతు వేదికలు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంట్లో ఇద్దరిపేరునా రుణాలు ఉంటే.. రూ.2 లక్షలు దాటిందంటూ పెండింగ్లో పెడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా మాఫీ చేశారని, ఈ దఫా అలా లేదని వాపోయారు. సైదాపురం గ్రామంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. తాము ఓట్లేస్తేనే గెలిచారని, అలాంటిది రుణమాఫీ కాకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఏదో ఒకటి తేల్చకుంటే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
మేం బ్యాంకులో లక్షా 60 వేలు వ్యవసాయ రుణం తీసుకు న్నాం. ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తున్నాం. అయినా మాకు మాఫీ కాలేదు. మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు. ఇప్పుడు ఎందుకు మాఫీ చేస్తలేరు.
నా పేరు మీద బ్యాంకులో లక్ష, భార్య పేరు మీద 70వేలు, కొడుకు పేరు మీద 60 వేలు ఉన్నయి. మొత్తం కలిపి రూ.2.10లక్షలు అవుతున్నదని కాబట్టి మాఫీ కావు అంటున్నరు. ఇది అన్యాయం.
రుద్రంగి, ఆగస్టు 26: ప్రభుత్వ మరో విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామమైన రుద్రంగి మండల పరిధిలో 3039 మంది రైతులు రుణాలు తీసుకోగా.. 1896 మందికి మాత్రమే మాఫీ అయ్యింది. మిగిలినవాళ్లు ఎప్పుడు రుణమాఫీ జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. రుద్రంగి రైతు బోయిని చంద్రయ్య మాట్లాడుతూ.. ‘నాకు 3.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నేను రూ.98,000 లోన్ తీసుకున్నా. మొదటి విడుత జాబితాలో నా పేరు లేదు. అధికారులను అడిగితే తరువాత విడుతల్లో వస్తుందన్నరు. కానీ, మూడు లిస్టుల్లో కూడా నా పేరు రాలేదు. రుణమాఫీ జాబితా గందరగోళంగా ఉన్నది. రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ దానిని విస్మరించింది’ అని పేర్కొన్నారు