హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కరెంటు కష్టాల నుంచే టీఆర్ఎస్ పుట్టిందని విప్ బాల్క సుమన్ అన్నారు. కేంద్ర విద్యుత్తు బిల్లు-పర్యవసానాలపై సోమవారం ఆయన అసెంబ్లీలో లఘు చర్చను ప్రారంభిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్ వద్ద కరెంటు కోతలకు నిరసనగా ధర్నాలు చేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో విద్యుత్తు రంగంలో సాధించిన ప్రగతిని చూసి దేశమే ఆశ్చర్యపోతున్నదని అన్నారు. రైతులకు 24 గంటలు, దోబీఘాట్లు, బార్బర్ షాపులకు 250 యూనిట్లు, ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జాబితాలో ఉన్న కరెంటుపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఏపీలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు.
ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శ్రీకాకుళం వెళ్లి మోటర్లకు పెట్టిన మీటర్లను పరిశీలించి వచ్చారని తెలిపారు. తన కంఠంలో ప్రాణం ఉండగా మోటర్లకు మీటర్లు పెట్టనని చెప్పిన ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అని అన్నారు. కాకతీయ కాలువ, వరద కాలువలపై రైతులు మోటర్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన మానవతామూర్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. స్వరాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7 వేల మెగావాట్ల నుంచి 17 వేల మెగావాట్లకు పెరిగిందని వివరించారు. దానవీయ పీఎం మోదీ- మానవీయ సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిసున్నదని, రైతు వ్యతిరేక మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి పారదోలే దిశగా సీఎం కేసీఆర్ ముందడుగు వేయాలని యావత్ తెలంగాణ సమాజం కోరుకొంటున్నదని చెప్పారు. గుజరాత్లో తడీపార్ రాజ్యాంగం అమలవుతున్నదని, మైనారిటీలు, దళితులపై దాడులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.