కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదలచేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. బీజేపీ మ్యానిఫెస్టో ప్రకారం గత ఏడేండ్లలో 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నదని, ఏ రాష్ట్రంలో ఎన్ని భర్తీ చేశారో చెప్పాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా కేంద్రం ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏడేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు పోగొట్టిన ఘనత బీజేపీదేనని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ రేటు దేశంలో 8.32 శాతం ఉండగా, తెలంగాణలో 4.07 శాతం మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో 24 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారని, దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు.