అన్నపురెడ్డిపల్లి, నవంబర్ 22: సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే నోట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట రావడం, అన్నదాతల మనసుల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచారంటూ ఆయనే స్వయంగా గుర్తుచేయడం వంటి మాటలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో శనివారం చోటుచేసుకున్నది. అన్నపురెడ్డిపల్లిలోని రైతువేదికలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘నేను బ్యాంకుకు వెళ్లినప్పుడు రైతులు అక్కడ పంట రుణాల కోసం వేచి ఉన్నారు. ఇవి కేసీఆర్ పాస్ పుస్తకాలు అనుకుంటూ సంభాషించుకుంటున్నారు’ అని తెలిపారు. కేసీఆర్ పంపిణీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతుల్లో అంతలా ముద్రపడినట్టుగానే ఇందిరమ్మ చీరలకు కూడా ఆ స్థాయిలో పేరొచ్చేలా మహిళలు ప్రచారం చేయాలని కోరారు.