మియాపూర్, జూలై 7 : మియాపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఆ తరువాత మృతదేహాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి తగులబెట్టింది. ఆపై భర్త కనిపించకుండా పోయాడని మియాపూర్ ఠాణా లో ఫిర్యాదుచేసింది. వివరాలు ఇలా.. మియాపూర్ ఠాణా పరిధిలోని అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన పెంటేశ్ అనే రైతు అమలాపురానికి చెందిన సత్యవతిని రెండో వివాహం చేసుకున్నాడు. వారికి కుమారు డు ఉన్నాడు. తన భర్త పెంటేశ్ గతేడాది నవంబర్ 19న పొలానికి వెళ్లి అదృశ్యమయ్యాడని, ఫోన్ సైతం స్విచాఫ్ వచ్చిందని నవంబర్ 25న సత్యవతి మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్య కాల్ డాటాతోపాటు నివాస ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సత్యవతి తన ప్రియుడితో కలిసి భర్త పెంటేశ్‌ను హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. భర్తకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించిన అనంతరం ప్రియుడితో కలిసి గొంతు నులమడంతోపాటు ముఖంపై దిండుతో ఊపిరి ఆడకుం డా చేసి హత్యచేసినట్టు గుర్తించారు. అనంతరం ప్రియుడితోపాటు మరో వ్యక్తితో కలి సి శవాన్ని కారులో మహారాష్ట్రలోని తుల్జాపూర్ సమీపంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనలో సత్యవతితోపాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.