Inter Exams | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణలో తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో ఓ ప్రశ్నను అస్పష్టంగా (మసక.. మసకగా) ఇచ్చారు. సెక్షన్-బీలో 7వ ప్రశ్నగా చార్ట్‌ను ఇచ్చారు. అయితే ముద్రణ లోపం కారణంగా ఈ చార్ట్‌లో ఇచ్చిన వివరాలు విద్యార్థులకు స్పష్టంగా కనిపించలేదు. దీంతోపాటు ప్రశ్నపత్రంలో 4, 5 పేజీలను సరిగ్గా ముద్రించలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. అస్పష్టంగా వచ్చిన ప్రశ్న నాలుగు మార్కుల ప్రశ్నకావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నది.
తప్పిదం ఇంటర్బోర్డుది కావడంతో నాలుగు మార్కులు కలపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులు ఇదే విషయంపై లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటర్ బోర్డు స్పందించింది. ఏడో ప్రశ్నలో గీతలతో అస్పష్టత నెలకొనడంతో సబ్జెక్ట్ నిపుణులు సుదీర్ఘంగా చర్చించారు. సమాధాన పత్రంలో జవాబు రాయడానికి ప్రయత్నించిన వారందరికీ కేటాయించిన మార్కులు ఇవ్వనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. సోమవారం నిర్వహించిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు 13,029 మంది విద్యార్థులు (2.91శాతం) గైర్హాజరయ్యారు.