హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఈ భూమిపై జరిగే పరిణామాలన్నింటికి మానవులుగా మనమే కారకులం. మన అవసరాలు, అత్యాశలు భావితరాలకు తీవ్రమైన ముప్పును తెచ్చిపెడుతున్నాయి. మానవాళి అవసరాల కోసం ప్రకృతిని పణంగా పెట్టి తెచ్చుకున్న పారిశ్రామిక విప్లవం ఓవైపు మన అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడుతూనే మరోవైపు కాలుష్యాన్ని తెచ్చిపెట్టింది. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించి ప్రకృతి వైపరీత్యాలతోపాటు మరెన్నో అనర్థాలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో మనం ఇంధన పొదుపు పద్దతులను పాటించడంతోపాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోగలిగితే పర్యావరణాన్ని, సమాజాన్ని రక్షించిన వారమవుతాం. ఇందుకోసం ఉద్దేశించిన కార్యక్రమమే ‘మిషన్ లైఫ్’. దీని ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 307 బిలియన్ యూనిట్ల విద్యుత్తు, 24.68 మిలియన్ టన్నుల చమురును ఆదా చేయడంతోపాటు 306.40 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగాం. 2027-28 నాటికి దేశంలోని వంద కోట్ల మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నడుం బిగించింది. ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది.