నిడమనూరు, జూలై 1: దశాబ్దాల క్రితం నల్లగొండ మున్సిపాలిటీ, నిడమనూరు మండలంలోని 80 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించిన ముప్పారం మంచినీటి పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది. కాలంచెల్లిన పథకం పేరుతో మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోకపోవడంతో భారీ పైపులు, గూనలతో ఏర్పాటుచేసిన పైపులైన్‌ను కొందరు అక్రమార్కులు రాత్రివేళల్లో జేసీబీలతో తవ్వి అక్రమంగా విక్రయిస్తున్నారు. ఒక్కో గూనను రూ.12 వేలకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అప్పట్లో ఖరీదైన పరికరాలను వినియోగించిన అధికారులు మిషన్ భగీరథకు ఈ పథకాన్ని అప్పగించారు. అధికారులు ఈ పరికరాలను నిర్లక్ష్యంగా వదిలేయడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఖరీదైన మోటర్లు, ఇనుప సామగ్రి, పైపులైన్ నిర్మాణంలో ఉపయోగించిన భారీ గూనలు, పైపులను తవ్వి ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా అడ్డుకునే వారేలేరు. కొందరు జట్టుగా ఏర్పడి ఈ గూనలను చాటుమాటుగా తవ్వి వెలికి తీసి విక్రయిస్తుండటం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్నది. దీంతో ప్రభుత్వ ధనం దొంగలపాలవుతున్నది.
ఉదయ సముద్రంతో ముప్పారం పథకానికి చెక్
నల్లగొండకు ఉదయసముద్రం చెరువు నుంచి తాగునీటిని సరఫరా చేస్తుండటంతో ముప్పారం పథకం నిలిచిపోయింది. కాలంచెల్లిన పథకం పేరుతో అధికారులు దీని నిర్వహణను నిర్లక్ష్యం చేశారు. దీంతో పథకం నిర్మాణంలో ఉపయోగించిన ఖరీదైన మోటర్లు, భారీ గూనలు ఇప్పటికే చోరీకి గురయ్యాయి. ముప్పారం పథకం నుంచి నల్లగొండకు వ్యవసాయ భూముల్లోనుంచి నీటి తరలింపునకు భారీ పైపులు, గూనలతో ఈ పైపులైన్‌ను నిర్మించారు. నల్లగొండకు రక్షితనీటిని అందించేందుకు నిడమనూరు నల్లచౌట చెరువును అప్పట్లో రిజర్వాయర్‌గా మార్చారు. ఇప్పుడు ఈ పథకం మూలనపడింది. ఈ పథకాన్ని మిషన్ భగీరథకు అప్పగించినట్టు గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ విషయమై మిషన్ భగీరధ డీఈఈ నిరంజన్ సిన్హాను వివరణ కోరగా, మిషన్ భగీరథ శాఖకు ముప్పారం పథకాన్ని అప్పగించలేదని తెలిపారు. దానికి సంబంధించిన వివరాలేవీ తమ వద్ద లేవని, అక్రమాలకు సంబంధించి తమకేమీ తెలియదని చెప్పారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ పైపులు, గూనలు, ఇతర పరికరాలు చోరీకి గురికాకుండా చూసి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.