హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25(నమస్తే తెలంగాణ): డ్రోన్ నుంచి క్షిపణిని డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. కర్నూల్లోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (ఎన్ఓఏఆర్) నుంచి దీనిని పరీక్షించింది. డీఆర్డీవో పరిశోధకులు రూపకల్పన చేయగా.. ఈ యూఏవీ ద్వారా అధునాతన క్షిపణి (యూఎల్‌పీజీఎం-వీ3)ని ప్రయోగించినట్లుగా డీఆర్డీవో, ఆర్సీఐ పరిశోధకులు వెల్లడించారు. ఈ మిస్సైల్‌ను గతంలో డీఆర్డీవో అభివృద్ధి చేయగా, భారత రక్షణ అవసరాలకు అనుగుణంగా అప్డేటెడ్ వెర్షన్‌ను తాజాగా సిద్ధం చేశారు. విస్తృత శ్రేణి లక్ష్యాలను కూడా ఇది చేధిస్తుందని, మైదానాలు, ఎత్తైన ప్రాంతాల్లోనూ దాడి చేయడానికి వీలు ఉంటుందని అధికారులు తెలిపారు. డీఆర్డీవోలోని ఆర్సీఐ, డీఆర్డీఎల్, టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబోరేటరీ, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి.