హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 ( నమస్తే తెలంగాణ) : తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయలను ప్రపంచస్థాయిలో తీసుకెళ్లేందుకు 72వ మిస్ వరల్డ్ పోటీలు ఉపయోగపడతాయని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవి కేవలం అందాల పోటీలు మాత్రమే కాదని, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. హైటెక్‌సిటీలోని ట్రైడెంట్ హోటల్లో మంగళవారం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చాలా రాష్ర్టాలు ఈ పోటీలను నిర్వహించేందుకు పోటీ పడ్డాయని, చివరికి తెలంగాణ ఆ అవకాశం దక్కించుకుందని వివరించారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ అండ్ సీఈవో జులియ మోర్లే మాట్లాడుతూ తెలంగాణలో అద్భుతమైన టూరిజం ఉందని, వరల్డ్ క్లాస్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు కావాల్సిన అన్ని అర్హతలు హైదరాబాద్‌కు ఉన్నాయని, అందుకే తెలంగాణను వేదికగా చేసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.
సినీ నటుడు సోనూసూద్ తన ఫేమస్ డైలాగ్ ‘వదల బొమ్మాళీ..’ అంటూ మిస్ వరల్డ్ పోటీల గురించి ముచ్చటించారు. ఈ పోటీలు బ్యూటీ విత్ పర్పస్ అని పేర్కొన్నారు. చాలా అవార్డ్స్ ఫంక్షన్లలో పాల్గొన్నానని, కానీ ఈ మిస్ వరల్డ్ పోటీల్లో అథిగా హాజరవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు వివరించారు. మిస్ వరల్డ్ పోటీలకు దేశంలో అనువైన ప్రాంతంగా తెలంగాణ ఒక్కటే ఉందని చెప్పారు. మిస్ ఇండియా నందినిగుప్త్తా మాట్లాడుతూ.. తెలంగాణకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ తనకెంతో ఇష్టమని చెప్పారు. ఈ పోటీల్లో సొంత గడ్డ నుంచి తాను కూడా పాల్గొనడం గొప్పగా ఉందని చెప్పారు. జయేష్ రంజన్ మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీలను అందరూ వీక్షించేలా అవకాశం కల్పించినట్టు తెలిపారు. పోటీలను వీక్షించాలనుకుంటున్న వారు www.telangana tourism.gov.inలో వివరాలు పంచుకుంటే, తాము పాస్‌లు జారీచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, గౌరవ్ కె.కుమార్ పాల్గొన్నారు.