హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): చారిత్రక బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని గురువారం పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోఠి మహిళా కళాశాలకు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1806లో నిర్మించిన ఈ భవనాన్ని తెలంగాణ హెరిటేజ్‌శాఖ, ప్రపంచ స్మారక నిధి(డబ్ల్యూఎంఎఫ్), ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.13.5 కోట్లతో అద్భుతంగా పునరుద్ధరించినట్టు తెలిపారు. వారసత్వ విలువలకు చిరునామాగా ఉన్న ఈ భవనాన్ని శుక్రవారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని కళాశాల యాజమాన్యానికి మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డీ రవీందర్రావు, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత, డబ్ల్యూఎంఎఫ్ ప్రతినిధి అమితా బేగ్, ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి, తెలంగాణ హెరిటేజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.