హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సీసీఎంబీ సంస్థ అరుదైన ప్రయోగాలకు, అరుదైన సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. దేశంలోనే తొలిసారిగా మైనస్ 190 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద కూడా పనిచేసే కైరో ప్రిజర్వేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 దేశాల్లో మాత్రమే అందుబాటు లో ఉండటం విశేషం. ఈ టెక్నాలజీ సహాయంతో అంతరించిపోతున్న వన్యప్రాణులు, అరుదైన జంతుజాలాల జన్యుక్రమాన్ని భద్రపరిచి, వాటిని పరిరక్షించేందుకు సీసీఎంబీ లాకోన్స్ కృషి చేస్తున్నది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆధునిక టెక్నాలజీ సాయంతో బయో రిజర్వు బ్యాంక్‌ను రూపొందించి, వైల్డ్‌లైఫ్ బయోకన్జర్వేషన్ విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనిద్వారా అంతరించిపోతున్న వన్యప్రాణులు, అరుదైన జంతువుల నుంచి సేకరించిన బయో శాంపిళ్లను నిల్వ చేసి పునరుత్పత్తి కోసం వినియోగిస్తారు. ఆయా జంతువుల అండాలు, శుక్రకణాలను సేకరించి, వాటిని కైరో ప్రిజర్వేషన్‌లో నిల్వ చేసి ఫలదీకరణం చేయడం ద్వారా కొత్త జీవి జీవం పోసుకుంటుందని పరిశోధకులు వివరించారు.