హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తెలంగాణ సీఎంవోతోపాటు డిప్యూటీ సీఎం, మంత్రుల వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారు. మీడియా వాట్సాప్ గ్రూపులు కూడా ఆదివారం హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ షేర్చేసిన సైబర్ నేరగాళ్లు.. వాటిని ఓపెన్ చేయగానే ఆ ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల మోసాలతో అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేస్తూ ‘దమ్ముంటే పట్టుకోండి’ అన్నట్టు సవాల్ విసురుతున్నారు.
రాష్ట్రంలో ఆదివారం ఉదయం సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్‌ను షేర్ చేసి, ఆధార్ అప్డేట్ చేసుకోవాలని మంత్రులు, జర్నలిస్టులకు సందేశాలు పంపారు. కొందరు వాటిని ఓపెన్ చేసిన వెంటనే ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అలా సీఎంవో, డిప్యూటీ సీఎంవో గ్రూపులు, మంత్రుల అధికారిక గ్రూపులు, మీడియా గ్రూపులను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అనంతరం మంత్రుల పీఆర్వోల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లూ హ్యాక్ అయినట్టు మెసేజ్‌లు వచ్చాయి. వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అవుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హ్యాక్ అయిన వాట్సాప్ గ్రూపులను సురక్షితంగా ఉంచారు. హ్యాకర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు.
పోలీసుల నిర్లక్ష్యం
సైబర్ నేరగాళ్లు తమ ఫోన్లను హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారని, తక్షణమే స్పందించాలని పలువురు జర్నలిస్టులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ‘ఇవాళ ఆదివారం.. అధికారులెవరూ లేరు.. రేపు రండి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొనడంతో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఫోన్లు హ్యాక్ కావడంపై ఫిర్యాదు చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం పలువురు జర్నలిస్టులు అసెంబ్లీ ఎదుట ఉన్న సైబర్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు వెళ్లారు. ‘ఆపదలో ఉన్నా. డబ్బులు పంపండి. రేపు ఇస్తా’ అంటూ తమతోపాటు తమ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారందరికీ కేటుగాళ్లు మెస్సేజ్ చేశారని, దీంతో కొందరు స్పందించి డబ్బులు కూడా ఇచ్చారని తెలిపారు. ఈ మోసాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించాల్సిన సీసీఎస్ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ‘ఈ రోజు సండే. అధికారులెవరూ లేరు. రేపు వస్తే చర్యలు తీసుకుంటాం. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ తమతో దురుసుగా ప్రవర్తించాలని పలువురు జర్నలిస్టులు ఆరోపించారు. ఎమర్జెన్సీ సేవలు అందించే పోలీసులకు సండే ఏమిటి? మండే ఏమిటి? అని అసహనం వ్యక్తం చేస్తూ కాసేపు అక్కడే నిరసన తెలిపారు.