హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత రెడ్డి, తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉద్యమ కాలం నుంచి సుపరిచితుడైన శ్రీనివాస్ మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
కాగా, శ్రీనివాస్ వరంగల్ జిల్లాలోని తన స్వగ్రామం పరకాలలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక దవాఖానలో చేరారు. అయితే చికిత్స పొందుతూ చనిపోయారు. శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోచీఫ్గా పనిచేస్తున్నారు.