మహబూబ్ నగర్, డిసెంబర్ 27: కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజా పాలన(Prajapalana) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగమంతా సమాయాత్తం కావాలని మంత్రులు దామోదర రాజా నర్సింహ(Minister Damodara), జూపల్లి కృష్ణారావు(Minister Jupalli) అధికారులను ఆదేశించారు. ప్రజా పాలనపై బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రజా పాలన, ఆరు గ్యారెంటీల అమలుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని, వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతానికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని దిశానిర్ధేశం చేశారు.
ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తు తీసుకోవాలి. సోషల్ మీడియా, మీడియా, సినిమా థియేటర్లలో ప్రదర్శన, చాటింపు ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.