సూర్యాపేట, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : హామీలను అమలు చేయకుండా, పూటకో అబద్ధం, రోజుకో మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రుణమాఫీ విషయంలో అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ రుణమాఫీ మోసం, బీజేపీ డీలిమిటేషన్ కుట్రలపై ఆదివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి చేతులెత్తేసి, చేయని రుణమాఫీ చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డీలిమిటేషన్ విషయంలో దక్షిణాదికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా మంత్రి పదవిని కాపాడుకునేందుకు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.