కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 25: ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కేవలం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాత్రమే హాజరయ్యారు. దీంతో ఉమ్మ డి జిల్లాలోని ముస్లింలంతా మనసు చిన్నబుచ్చుకున్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించేందుకు చేసిన ఏర్పాట్లన్నీ నిష్ప్రయోజనం అయ్యాయని ముస్లిం జేఏసీ ప్రతినిధులు వాపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన శాసనసభ్యులు, మంత్రులను సత్కరించి, ముస్లింల సమస్యలపై దృష్టిసారించాలని కోరేందుకు కరీంనగర్లోని కమా న్ సమీపంలోగల ఓ బాంకెట్ హాలులో ఆదివారం ఉమ్మడి జిల్లా ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, నాయకులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ఏర్పాటు చేయగా.. 2.30వరకు ఎవరూ రాకపోవడంతో జే ఏసీ ప్రతినిధులు అమాత్యులకు ఫోన్ చేశారు. అత్యవసర పనుల వల్ల తాము రాలేకపోతున్నామని, ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను లిఖితపూర్వకంగా తమ నాయకులకు అందజేస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూ వీడియోకాల్తో సరిపెట్టారు. దీంతో జేఏసీ ప్రతినిధులు అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న పలువురు ముస్లిం నాయకులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. చివరలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాగా.. ఆయనతోనే మమ అనిపించి సమావేశం ముగిస్తున్నట్టు ప్రకటించారు. మంత్రుల సంగతి అలా ఉంచితే.. ఎమ్మెల్యేలైనా రాకపోవడంపై ముస్లిం నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గత ఎన్నికల్లో వారి గెలుపుకోసం తాము చేసిన కృషిని గుర్తుచేసుకోవడం కనిపించింది.