నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎందుకు తనను టార్గెట్ చేసి విమర్శిస్తున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. లక్ష్మణ్‌కు నాపై ఎందుకంత ఈర్ష్య అని ప్రశ్నించారు. కష్టపడి పనిచేస్తున్న నాపై కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అడ్లూరి లక్ష్మణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనను రాజకీయాల్లో ప్రోత్సహించిందే తన తండ్రి వెంకటస్వామి అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో జరిగిన మాలల గర్జన వల్ల మాలల్లో ఐక్యత పెరిగింది. దేశంలో ఒక సామాజిక వర్గానికి చెందిన సభ అంత పెద్దగా జరగటం ఇదే మొదటిసారి. మాలల కోసం పోరాటం చేస్తుంటే కొందరు కుట్రలతో సోషల్ మీడియా వేదికగా తనను అవమానించే ప్రయత్నం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ 15 నుంచి 18 శాతానికి పెంచాలని తీర్మానం చేశాం, కానీ అలా జరగలేదు’ అన్నారు.
‘రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం జరిగింది. పోరాడితేనే ఫలితాలు వస్తాయి. దేశంలో ఇంకా కులవివక్ష ఉంది. మాల ఉద్యోగులకు వేధింపులు తప్పటం లేదు. మంత్రిగా నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఆయన నా మీద కావాలనే విమర్శలు చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంశంలోనూ అనవసరంగా నా పేరు ప్రచారం చేశారు. మంత్రి అడ్లూరిని రాజకీయంగా ప్రోత్సహించింది కాకా. మంత్రి అడ్లూరిని కావాలనే నా మీద విమర్శలు చేస్తున్నారు’ అని వివేక్ ఆరోపించారు.
‘నాది మాల జాతి అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నన్ను విమర్శిస్తూన్నారు. నాకు మంత్రి పదవి మీద మోజు లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్ట పడుతున్నాం. నేను ఇన్చార్జ్ అయ్యాక జూబ్లీ హిల్స్‌లో ఓటింగ్ శాతం పెరిగింది. ఒక వర్గం మీడియా కావాలనే నన్ను టార్గెట్ చేసింది. నేను నిజాయితీగా ఉన్నా. నిజాయితీగా వ్యాపారాలు చేస్తున్నా. మాలలు అంతా కలిసి ఉండాలి’ అని ఆయన కోరారు.