నిజామాబాద్ : అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రకటించిన రూ. 10వేల పరిహారానికి తోడుగా కేంద్రం కూడా రూ. 10వేలు ఇవ్వాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Prashanth Reddy) డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో వర్షాలతో నష్టపోయిన పంటలను ఆదివారం మంత్రి పరిశీలించారు.
బాధిత రైతులతో ఆయన మాట్లాడుతూ రైతులు(Farmers) ఎలాంటి దిగులు చెందవద్దని కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని అన్నారు.తడిసిన ధాన్యాన్ని(Wet Grain) రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం కొర్రీలు పెడుతుందని ఆరోపించారు.
రైతుల ధాన్యాన్ని తీసుకోవడంలో ఫుట్ కార్పొరేషన్ ఇండియా(FCI) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుందని అన్నారు. కేంద్రం పరిహారం ప్రకటించిన తరువాతనే బీజేపీ నాయకులు(Bjp Leaders) రైతుల పొలాల్లో అడుగు పెట్టాలని పేర్కొన్నారు.