హుజూర్నగర్, జూలై 22: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలం రామాపురంలోని కల్తీ మద్యం అమ్మకాల్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్తీ మద్యం వ్యవహారంలో అమాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యం తయారు చేస్తూ కాంగ్రె స్ నాయకులు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇందు లో మంత్రి ప్రమేయం లేకపోతే అక్రమార్కులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిబంధనల ప్రకారమే హెచ్‌సీయూలో ప్రవేశాలు ; వర్సిటీ రిజిస్ట్రార్ నిగమ్ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశాల ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరుగుతున్నదని రిజిస్ట్రార్ నిగమ్ తెలిపారు. వర్సిటీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యాబోధన, ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. గతంలో 1:1 ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని గుర్తుచేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విద్యాసంవత్సరంలో 1:10 ప్రాతిపదికన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విధానం వల్ల విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. అందుకే అడ్మిషన్ల ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతుందని వెల్లడించారు. ఇన్చార్జి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి నియామకంలో కూడా ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టంచేశారు. నిబంధనల ప్రకారమే ప్రస్తుతమున్న సీవోఈని నియమించామని వెల్లడించారు. ప్రవేశాల ఆలస్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ ఏడాది అన్ని సీట్లను భర్తీ చేస్తామని ప్రకటించారు.