హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తున్నదని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అమలైన కార్యక్రమాలపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, అభివృద్ధిని నడిపిస్తూ మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యం గా పనిచేసిందని, ముఖ్యంగా ఆహారభద్రత, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ప్రభు త్వం ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. ‘వెయ్యి రోజులు ఒక మైలురాయి మాత్రమే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమాన్ని మరింత విస్తరించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యం. ఆర్థిక సవాళ్లు ఎన్ని ఉన్నా ప్రజాసంక్షేమం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.