హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తర లించకుండా ఆపాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఉదయ్‌పూర్‌లో జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రెండో ఆలిండియా స్టేట్ వాటర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృష్ణా నీటి వినియోగాన్ని పర్యవేక్షించడానికి టెలిమెట్రీ పరికరాలను అమర్చాలని, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ కేసును త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ ఖర్చును పూర్తిగా కేంద్రం భరించాలని కోరారు. మేడిగడ్డ బరాజ్‌పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణను పూర్తి చేయాలని చెప్పారు.
గంగా, యమునా పునరుద్ధరణ మాదిరిగా గంగా, యమునా పునరుద్ధరణ ప్రాజెక్టుల మాదిరిగా మూసీ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు. మూసీ వెంట ట్రంక్, ఇంటర్‌సెప్టర్ సీవర్ నెట్వర్క్ ఏర్పాటుకు రూ.4 వేల కోట్లు, గోదావరిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌తో లింక్‌కు అదనంగా రూ.6 వేల కోట్లు ఇవ్వాలని కోరారు.