Uttam Kumar Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చేంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపే ప్రసక్తే లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం శాసనసభలో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుడు నిర్ణయంగా భావిస్తున్నదని, ప్రాణహిత చేవెళ్ల మాదిరిగానే ముందుకు వెళితే బాగుండేదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన డ్యామేజీ చాలా పెద్దదని తెలిపారు. దీనిపై తొందరపాటు చర్యలు తీసుకోదల్చుకోలేదని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి అప్పగించనున్నట్టు ప్రకటించారు. వాళ్లు ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును తిరిగి రైతులకు ఏ విధంగా ఉపయోగపడేలా చేయాలో చర్చించి ముందుకెళ్తామని తెలిపారు.
కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరితే కేంద్రం ఇవ్వలేమని చెప్పినట్టు పేర్కొన్నారు. అయితే 60 శాతం ఫండింగ్ చేస్తామని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చారని తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు
నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్, డిండి, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కొడంగల్ – నారాయణపేట్ లిఫ్ట్, చిన్న కాళేశ్వరం, ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ, శ్రీపాద ఎల్లెంపల్లి ప్రాజెక్టు, ఇందిరమ్మ వరద కాల్వ, మిడ్ మానేరు, కొమ్రంభీం, దేవాదుల, గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాక్‌లో పూర్తిచేసి ఈ సంవత్సరంలోనే 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికతో ముదుకెళ్తున్నట్టు వివరించారు.
కృష్ణాలో మన వాటా 555 టీఎంసీలు
కృష్ణాజలాల్లో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తుచేశారు. పొతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం నీళ్లను పెన్నా బేసిన్‌లోని రాయలసీమకు తరలించుకుపోతున్నారనే అప్పుడున్న పది జిల్లాలు ఒక్కటై కొట్లాడాయని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్లో తెలంగాణకు 68.50శాతం పరీవాహక ప్రాంతం ఉందని, దీని ప్రకారం మనకు 555 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉందని తెలిపారు.
ఏపీ పరీవాహక ప్రాంతం 31 శాతమే కావడంతో ఆ రాష్ర్టానికి 256 టీఎంసీలు మా త్రమే దక్కాల్సి ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్న మంత్రి.. గడిచిన ఐదేండ్లల్లో కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల నుంచి 162 టీఎంసీల నీటిని లిఫ్ట్చేశారని వివరించారు.