హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఈ నెల 15 వరకు ప్రతి రైతుకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామన్న మాటపై ప్రభుత్వం నిలబడే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 15న రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. వైరాలో గోదావరి జలాలను ఖమ్మంకు అందించే సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయించాలని వ్యవసాయ శాఖ ఆలోచన చేస్తున్నదని తెలిపారు. మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఇందులో సుమారు ఆరు లక్షల మంది రైతులకు రూ.ఆరు వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ లెక్క ప్రకారం మూడు విడతల్లో కలిపి ప్రభుత్వం 23.74 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినట్టవుతుంది. ఈ లెక్కన రుణమాఫీ కోసం ప్రభుత్వం చేసే ఖర్చు రూ.18 వేల కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
గత నెల 29న చేసిన రూ.1.5 లక్షల వరకు రెండో విడత రుణమాఫీలో సాంకేతిక కారణాలతో 30 వేల మంది రైతులకు సాధ్యం కాలేదని మంత్రి వెల్లడించారు. తొలి విడతలో రూ. లక్ష వరకు రుణమాఫీలో 17 వేల ఖాతాలకు రుణమాఫీ కాలేదని, రూ.84 కోట్లు ప్రభుత్వానికి రిటర్న్ వచ్చాయని వివరించారు. 10 వేల ఖాతాలను సరి చేసి రూ.44 కోట్లు తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ఏడు వేల ఖాతాల సమస్యను పరిష్కరించాల్సి ఉన్నదని చెప్పారు. సాంకేతిక తప్పిదాలతో రుణమాఫీ కాని రైతుల కోసం ఈ నెల 15 తర్వాత కార్యాచరణ ప్రారంభించనున్నట్టు తెలిపారు.
రుణమాఫీలో తప్పిదాలకు బ్యాంకులే బాధ్యత వహించాలని మంత్రి స్పష్టంచేశారు. అప్పు ఉన్న రైతుల ఖాతాల వివరాలు ఇవ్వాలని మే నెలలోనే బ్యాంకులను కోరినట్టు తెలిపారు. బ్యాంకర్లు పంపిన వివరాల ప్రకారమే రుణమాఫీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. సరైన వివరాలు ఎందుకు పంపించలేదు? ఇందుకు కారణాలేమిటి? అనే అంశంపై వివరణ ఇవ్వాలని బ్యాంకులను కోరినట్టు తెలిపారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.
2022 మే 6న వరంగల్ రైతుసభలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ను విడుదల చేశారని, నాడు ఇచ్చిన హామీ ప్రకారం.. 2022 మే తర్వాత తీసుకున్న రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని తుమ్మల చెప్పారు. ఐదేండ్ల క్రితం తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తున్నామని తెలిపారు.
రుణమాఫీలో భాగంగా రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణాన్ని ముందుగా చెల్లించాలన్న నిబంధనతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, పెట్టుబడి కాలం కావడంతో అప్పు చేసి మరీ మొత్తం చెల్లిస్తున్నారని, ఈ నిబంధనను సడలించాలంటూ రైతు సంఘాలు చేస్తున్న డిమాండ్‌ను మీడియా ప్రతినిధులు మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి… ‘రైతులు ఇంట్లో ఉన్నవి కట్టారేమో నాకేం తెలుసు? అందరూ అప్పు తెచ్చి కట్టారని మీరెలా అనుకుంటారు?’ అంటూ ఎదరు ప్రశ్నించడం గమనార్హం. రూ.2 లక్షలకు ఎక్కువ ఉన్న మొత్తాన్ని చెల్లించి ఆ తర్వాత పది లక్షలు తీసుకో అది మీ ఇష్టం అంటూ రైతులకు సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రైతులను కించపరిచేలా ఉన్నాయని రైతులు, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.