హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సనత్‌నగర్‌లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కార్యాలయాన్ని సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్నతాధికారితోపాటు పలువురు అధికారులు, సిబ్బంది లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సెక్షన్‌ను సందర్శించి, ఫైళ్లను పరిశీలించారు. అందుబాటులో ఉన్న అధికారుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్‌లో నమోదైన వివరాలతో కూడిన హాజరు పట్టికను పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిన వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అనంతరం కాలుష్య నివారణ, నియంత్రణకు బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న పరిశోధనలు, చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.