హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): నేలతల్లి సంరక్షణకు ప్రజలంతా ఇప్పటికైనా సిద్ధం కావాలని అటవీ పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఆమె ఆదివారం ఒక సందేశం ఇచ్చారు. పుడమి సంరక్షణ చర్యలను ఒక ఉద్యమంగా చేపడితేనే భావితరాల మనుగడ సాధ్యమవుతుందన్నారు. మనుషుల మితిమీరిన అవసరాలు, అనాలోచిత చర్యలతో భూమి తన జీవాన్ని కోల్పోతున్నదని, దీంతో సమస్త ప్రాణికోటికి నష్టం జరుగుతున్నదని తెలిపారు. ప్లాస్టిక్‌తో పుడమి ఉనికి ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ (ప్లాస్టిక్ మీద భూగ్రహ సమరం)’ ప్రకటించిందని తెలిపారు. ప్రతి ఒకరూ ప్లాస్టిక్ రహిత జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి ప్రళయంగా మారకముందే ప్రజలంతా మేలుకోవాలని సూచించారు.