నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై బుధవారం విచారణ ప్రారంభమైంది. నిందితురాలిగా ఉన్న మంత్రి సురేఖ కోర్టుకు గైర్హాజరయ్యారు. ఆమె తరఫున న్యాయవాది దాఖలు చేసిన గైర్హాజరు పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో ఫిర్యాదుదారు డు నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు నమో దు చేసింది. గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్లో మీడియాతో మాట్లాడుతూ సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు పలు టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియోలను, ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలను సాక్షాధారాలుగా సమర్పించినట్టు నాగార్జున కోర్టుకు తెలిపారు. తమ కుటుంబ వ్యవహారంపై మంత్రి చేసిన వ్యాఖ్యలతో తమ పరువు, ప్రతిష్టకు భంగం కలిగినట్టు వివరించారు. నాగచైతన్య-సమంత విడాకుల గురించి సురేఖ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని తెలిపారు. విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ జడ్జి శ్రీదేవి ఉత్తర్వులు జారీచేశారు. నాగార్జున తనయుడు నాగచైతన్య సైతం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.