Minister Srinivas Reddy | ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకే ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి పనులపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించామన్నారు. ప్రభుత్వ హామీలు, వాటి స్టేటస్‌పై అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. ప్రధానంగా ఇరిగేషన్‌పై దృష్టి సారించామన్నారు. డబుల్ బెడ్రూం స్కీమ్ సంబంధించి భారీగా బిల్స్ పెండింగ్ ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలో అధికారులతో చర్చించామన్నారు.
ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా సంక్షేమ పతకాలు అందజేస్తామన్నారు. రూ.75కోట్లు మేడారం జాతరకు కేటాయించామన్నారు. మరో రూ.35కోట్ల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. రాబోయే బడ్జెట్లో వరంగల్ జిల్లాకి ఏం కావాలో పొందుపరుస్తామన్నారు. గత ప్రభుత్వంలో 59జీవో ద్వారా ఆక్రమించుకున్న భూములను పేదలకు ఇస్తామన్నారు. ఇందిరమ్మరాజ్యంలో ప్రజలకు ఏం కావాలో వాటి సాధనకు పనిచేస్తామన్నారు. కాళోజీ కళా క్షేత్రమాన్ని సాధ్యమైనంత త్వరలో కాళోజీ క్షేత్రాన్ని పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి.. ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు.
ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా వదలమన్నారు. ఎవరు ఆక్రమించిన వెనక్కి తీసుకుంటామన్నారు. మరో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజల కోసం పని చేస్తేనే పరిపాలనకు అర్థమన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని తీర్చడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గాల్లో వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. వాటికి నిధులు సమకూర్చడం భారంగా మారిందని, ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ప్రజల కోసం అధికారులు పనిచేయాలని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాజీపడొద్దని అధికారులకు సూచించామన్నారు.