హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ)/ రవీంద్రభారతి: హైదరాబాద్ నుంచి తిరుపతి, షిర్డీకి వెళ్లే భక్తుల ప్రయాణ సౌకర్యార్థం రాష్ట్ర టూరిజం శాఖ కొత్తగా ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతి వద్ద ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నదని పేర్కొన్నారు. భక్తులు, ప్రయాణికులు ఇలాంటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టూరిజం ఎండీ మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్‌రెడ్డి, ఓఎస్డీ డీ సత్యనారాయణ, రాజలింగం, మల్లికార్జునరాజు, శాంతి, జ్యోతి, ఇబ్రహీం, నాథ న్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఎక్సైజ్ స్టేషన్ల ఏర్పాటుపై తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆబ్కారీ శాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పని తీరుపై కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు పొందిన ఎస్సైలకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే గుడుంబా, గంజాయి, డ్రగ్స్‌పై నిఘా పెట్టాలని సూచించారు. తెలంగాణను గుడుంబా, గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను, ఉన్నతాధికారులను ఆదేశించారు.