జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాను సస్యశ్యామలం చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం పరిశీలించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించి త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి గద్వాల జిల్లాకు కూలీ పనుల కోసం కార్మికులు వలస వస్తున్నారని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. 45 రోజుల్లో చిన్నోనిపల్లి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం స్మితా సబర్వాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గద్వాల ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించడం జరిగిందన్నారు. అదే విధంగా ఆర్ అండ్ ఆర్ సెంటర్ల గురించి కూడా తెలుసుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు పనుల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయాలన్నారు.