హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఇటీవల లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఆ దిశగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మద్యం దుకాణాలను తనిఖీలు చేయాలని కోరారు. మంగళవారం సచివాలయంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్టులను మరింత బలోపేతం చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నియంత్రించాలని మంత్రి ఆదేశించారు.
చెక్ పోస్టుల్లో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద రవాణాశాఖ చెక్ పోస్ట్‌తో కలిపి సమీకృత తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మద్యం దుకాణాల కేటాయింపును విజయవంతంగా పూర్తిచేసిన ఎక్సైజ్ అధికారులను మంత్రి సన్మానించారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ ఫరూఖీ, జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్లు చంద్రయ్యగౌడ్, శ్రీనివాస్, ఈఎస్‌లు ఏ సత్యనారాయణ, టీ రవీందర్రావు, అరుణ్ కుమార్, విజయభాసర్గౌడ్, పవన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
22 మద్యం దుకాణాలకు రీ టెండర్
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల లైసెన్స్‌ల (2023-2025) కోసం ఇటీవల నిర్వహించిన టెండర్లలో ఐదు ఏజెన్సీ జిల్లాల్లో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 22 షాపులకు మళ్లీ టెండర్లు పిలువాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 28 వరకు దరఖాస్తులను స్వీకరించి, 29న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయనున్నారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతాలైన భూపాలపల్లి జిల్లాలో 3, కామారెడ్డిలో 1, ఆసిఫాబాద్‌లో 5, నిర్మల్‌లో 4, ఆదిలాబాద్ జిల్లాలో 9 దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఇప్పటికే ఆయా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణనలోకి తీసుకొంటూనే కొత్తగా దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.