Minister Sridhar Babu | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘మీరు మా పార్టీ కోసం సహకరించారు. ఎన్నికలప్పుడు మేమే మీతో దీక్షలు, ధర్నాలు చేయించాం. వాటికి పర్మిషన్లు కూడా మేమే ఇప్పించాం. ఈ నెల 26న మీ ప్రతినిధులను సీఎస్ దగ్గరకు తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాం’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు జీవో 46 బాధితులకు హామీ ఇచ్చారు. మంత్రి బుధవారం గాంధీభవన్‌కు వస్తున్నారన్న సమాచారంతో వందలాది మంది జీవో 46 బాధితులు గాంధీభవన్ ముట్టడికి తరలివచ్చారు. ముందుగా మంత్రి రాగానే ఘెరావ్ చేశారు. ఎన్నికల సమయంలో తమతో దగ్గరుండి ఆందోళనలు చేయించిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు ముఖం చాటేస్తుందని నిలదీశారు. తమకు జరిగిన అన్యాయాన్ని మంత్రికి వివరించారు. కావాలనే కొందరు కాంగ్రెస్ నేతలు తమ వాదనలు కోర్టులో నిలువకుండా అడ్డుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు బాధితులకు భరోసా కల్పించారు. మంత్రి హామీతో ప్రస్తుతానికి ఆందోళన విరమిస్తున్నామని జీవో 46 బాధితులు మీడియాకు చెప్పారు.
అటవీ సిబ్బందికి అవార్డులివ్వాలి ; కేంద్రానికి మంత్రి కొండా సురేఖ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): అటవీశాఖ సిబ్బందికి ప్రతి ఏడాది ప్రెసిడెన్షియల్ గ్యాలంటరీ అవార్డులను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కి బుధవారం లేఖ రాశారు. అటవీ అధికారుల నిరుపమానమైన సేవలను గుర్తిస్తూ వారికి అవార్డులు ప్రదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రస్థాయిలో అటవీ సేవా, వన సంరక్షణ సేవా పతకాలు, చీఫ్ మినిస్టర్ అవార్డు, జాతీయస్థాయిలో ప్రెసిడెన్షియల్ గ్యాలంటరీ అవార్డు, ఇందిర ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు, ఇతర జాతీయ అవార్డులను అందించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.