వనపర్తి సమీపంలోని వశ్య తండాకు ఒకరోజు ముందే పండుగొచ్చింది. తండాలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కార మార్గాలు చూపారు. మూణ్నెళ్లలో వశ్యా తండాకు సాగునీరు అందిస్తామని నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా కాలువలు తవ్వించి, ప్రతి ఎకరాను తడుపుతామని మాట ఇచ్చారు.
అలాగే, 45 రోజుల్లోగా తండాకు రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. స్థలం ఉండి ఇళ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయం చేస్తామన్నారు. 57 ఏండ్లు నిండి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ అందజేస్తామని తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, తండాలో ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతానని చెప్పారు.