వనపర్తి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఎమిటో చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీశారు. నడిగడ్డకు, ఉమ్మడి జిల్లాకు నష్టం కలిగించే కర్ణాటకలోని అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలోని పాలమూరు లిఫ్ట్‌కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని మంగళవారం ఓ ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని 2014 ఎన్నికల ప్రచార సభలో చెప్పిన నరేంద్రమోదీ.. ఇప్పటికీ ఆ మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం సొంతగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం నయా పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా ఏడేండ్ల నుంచి తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పేరిట కుట్రకు తెరలేపిందని ధ్వజమెత్తారు. ఈ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన రాష్ట్ర బీజేపీ నేతలు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే పాలమూరు లిఫ్ట్‌కు జాతీయ హోదా తీసుకురావాలని సవాలు విసిరారు.
రాష్ట్రంలో యాసంగిలో పండే బాయిల్డ్, రా రైస్ ప్రతి గింజ కొనిపించే బాధ్యత తమదేనని, వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధమేమీ లేదని గతంలో పలుమార్లు చెప్పిన కిషన్‌రెడ్డి, బండి సంజ య్.. ఇప్పుడు జోగుళాంబ అమ్మవారి సాక్షిగా అబద్ధాలాడుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం ముందుకు రాకపోవడంతో యాసంగి వడ్లను తామే కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, అయినా ఇది తమ ఘనతేనని బీజేపీ నేతలు నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారని విమర్శించారు. ఐదో శక్తిపీఠంగా ఉన్న జోగుళాంబ ఆలయం పురావస్తు శాఖ పరిధిలో ఉన్నదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధి పనులను చేపట్టలేకపోతున్నదని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు తీసుకొచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పే దమ్ము కిషన్‌రెడ్డికి ఉన్నదా? ప్రభుత్వం తలపెట్టిన జోగుళాం బ బరాజ్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుం డా కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. మాచర్ల-గద్వాల రైల్వే లైనుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చే దమ్ముంటే కిషన్‌రెడ్డి, సంజయ్ ముందు కు రావాలని సవాలు విసిరారు. ఈ ప్రశ్నలన్నింటికీ బీజేపీ నేతలు సమాధానాలు చెప్పిన తర్వాతే పాదయాత్ర కొనసాగించాలని మంత్రి డిమాండ్ చేశారు.